కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎంత ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. భారత్ కు పెద్ద ముప్పు లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ వైరస్ కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన ఎనిమిది సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా వైద్యులు నిర్దారించినట్లుగా ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అందరిని ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏమంటే.. వైరస్ సోకినట్లుగా భావిస్తున్న బాలుడికి సంబంధించిన ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అలెర్టు అయ్యింది.
బాలుడి నుంచి శాంపిల్స్ సేకరించి వేర్వేరు ల్యాబ్స్ కు పంపి.. పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అంతేకాదు.. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొందరపడి ఆందోళన చెందకుండా.. మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంచలన అంశం కావటంతో.. ఈ సమాచారాన్ని ఇస్తున్నామే తప్పించి.. ఈ వివరాల్ని మేం ధ్రువీకరించటం లేదన్నది మర్చిపోకూడదు. దీనికి సంబంధించిన అప్డేట్ మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాం.