రాజధాని అమరావతి రైతులు సెప్టెంబరు 12నుంచి తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తమకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై రైతులు హైకోర్టు గడప తొక్కారు. దీంతో, అనుమతిస్తారో లేదో తేల్చి చెప్పాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా…శుక్రవారం ఉదయం తొలి కేసుగా దానిపై విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది.
హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఏపీ పోలీసులలో చలనం వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, గతంలోనూ మహా పాదయాత్ర సందర్భంగా రైతులు నిబంధనలు ఉల్లంఘించారని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నోటీసులిచ్చారు. అందుకే, అనుతివ్వడం కుదరదని నిన్న అర్థరాత్రి వెల్లడించారు. దీంతో, శుక్రవారం నాడు తొలికేసుగా దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి టు అరసవెల్లి మహా పాదయాత్రకు అనుమతినిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర సాగించవచ్చని కోర్టు వెల్లడించింది. అంతేకాదు, యాత్రకు అనుమతి కోరుతూ మరోసారి పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక, రైతుల దరఖాస్తును పరిశీలించి అనుమతివ్వాలంటూ పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించడం విశేషం.
సాక్ష్యాత్తూ హైకోర్టే యాత్రకు అనుమతివ్వాలంటూ పోలీసులకు ఆదేశాలివ్వడంతో యాత్రకు విఘ్నాలు తొలగిపోయినట్లయింది. దీంతో, అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట లభించగా..జగన్ కు షాక్ తగిలినట్లయింది. మరి, రైతుల మీద అక్కసుతో మరోసారి కూడా జగన్ అండ్ కో,ఏపీ పోలీసులు రైతుల పాదయాత్రకు సరికొత్త పద్ధతులలో ఆటంకాలు సృష్టిస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.