తెలుగు సినిమాలో మంచి నటులకు కొదవ లేదు. ఒక జోనర్ కు మాత్రమే ఫిట్ అవుతారన్న భ్రమల్ని కొందరు నటులు ఎప్పటికప్పుడు తుడిపేసుకునేలా ప్రయత్నం చేస్తుంటారు. అలానే కొందరు హీరోలు కూడా. కామెడీ నటుడిగా తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఉంచుకున్న హీరో అల్లరి నరేశ్. తనదైన టైమింగ్ తో ప్రేక్షకులకు ఫన్ తెప్పించే అతగాడు.. తనను తాను నటుడిగా ఫ్రూవ్ చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలకు.. ప్రయోగాలకు కొదవ లేదు. మొత్తంగా తన మీద ఉన్న కామెడీ ముద్రను విజయవంతంగా తుడిపేయటమే కాదు.. సీరియస్ యాక్టర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఇటీవల కాలంలో అతగాడికి సరైన సినిమాలు పడలేదు.
ఇలాంటివేళ.. ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం పేరుతో ఒక సినిమా ఈ వారం విడుదల కానుంది. దర్శకుడు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరే.. రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరిని ఆకర్షిస్తోంది. గిరిజన ప్రజలు.. వారు పడే కష్టాలు.. వారు ఎదుర్కొనే సమస్యల బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ మీద ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. రోటీన్ కు భిన్నమైన ఫార్మాట్ లో.. సరికొత్త కథను నమ్ముకున్న వారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నిరాశ పర్చింది లేదు. తాజాగా ఇదే నమ్మకంతో ఉంది చిత్ర టీం.
ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఇందులో చిత్ర కథానాయకుడు అల్లరి నరేశ్ మాట్లాడిన మాటల్లో అందరిని ఆకర్షించే మాట.. తనను ఈ మధ్యన చాలా బాగున్నావని అంటున్నారని.. ఆ మాట విన్నంతనే సిగ్గేస్తుందని చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఒక కామెడీ హీరో నుంచి సీరియస్ కథాంశాల్ని చేస్తున్న అల్లరి నరేశ్ కు.. ఇలాంటి కాంప్లిమెంట్ దక్కితే ఆ మాత్రం సిగ్గు పడకుండా ఉంటారా? ఇక.. ఈ వేడుకకు హాజరైన వారిలో పలువురు నరేశ్ ను కామెడీ జోనర్ వదలని చెప్పటం గమనార్హం.