‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగిందని, రూ.5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి పోయిందని పోలీసులకు మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దొంగతనం జరిగినప్పటి నుంచి మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండే అవకాశముందని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆ చోరీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న శ్రీను…మంచు కుటుంబంపై షాకింగ్ ఆరోపణలు చేశారు. తాను చోరీకి పాల్పడలేదని ,మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తోందని నాగ శ్రీను చెప్పిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను బూతులు తిడుతూ, చిత్ర హింసలు పెట్టారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
తన వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావిస్తూ కులం పేరుతో తనను అవమానించిన కారణంగా ఉద్యోగం మానేశానని, అలా మానేసినందుకు రూ.5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ అని అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. మోహన్ బాబు తనను తిట్టేవారని, మోకాళ్ళపై కూర్చోపెట్టి కొట్టేవారని, ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని చెప్పారు. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఫుటేజ్ లో అది కనిపిస్తుందని చెప్పారు. తనపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం తెలిసి తన తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని అన్నారు.
10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నానని, తనపై ఇలాంటి నిందలు వేయడం భావ్యం కాదని అన్నారు. తాను చాలా చిన్న వ్యక్తినని, మోహన్ బాబు వంటి పెద్దవారితో పోరాడలేనని చెప్పారు. తన వంటి చిన్నవారి జీవితాలతో ఆదుకోవడం అలాంటి పెద్దవాళ్లకు తగదని, దయచేసి తనను వదిలేయాలని కోరారు. ఈ వీడియో చూసిన పెద్దలు తనకు న్యాయం చేయాలని అన్నారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, శ్రీను ఆరోపణలపై విష్ణు రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.