విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల సైతం ఈ పేరు మార్పు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం సరికాదని ,ఇదే సంస్కృతిని కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించినా సరే ప్రభుత్వం మాత్రం ఈ పేరు మార్పు నిర్ణయంపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రమణ అనే జానపద కళాకారుడు ఓ పాటను రచించారు. ‘‘పేరును మార్చేస్తే చరిత మారుతుందా… ఉల్లిన మల్లంటే తెలుగు జాతి నమ్ముతుందా’’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పాటను రచించిన రమణ స్వయంగా తన బృందంతో కలిసి డప్పు వాయిద్యంతో ఈ పాటను ఆలపించారు. ఈ క్రమంలోనే ఈ పాటను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ జగన్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుని తీసేసి జగన్ చేసిన పనికిమాలిన పనిని జనం ఎంత ఛీ కొడుతున్నారో చెప్పడానికి ఈ పాట నిదర్శనం అని లోకేష్ చురకలంటించారు. పాట రూపంలో ఈ కళాకారుడు జగన్ ను ప్రశ్నిస్తున్నాడని లోకేష్ అన్నారు. ఒక పేరు మార్పు గురించే కాదు రాష్ట్రంలో జగన్ అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలిచిన అన్ని అంశాలతో కలిపి రూపొందించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ పేరును తీసేసి జగన్ రెడ్డి చేసిన పనికిమాలిన పనిని ప్రతి ఒక్కరూ ఎంత ఛీకొడుతున్నారో చెప్పడానికి నిదర్శనం ఈ కళాకారుల బృందగానం. పేరును మార్చేస్తే చరిత మారుతుందా? అని పాట రూపంలో అడుగుతున్నాడు రమణ అనే ఈ కళాకారుడు.#RetainNTRname pic.twitter.com/XxNz16o66s
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2022