టీడీపీ కేంద్రకార్యాలయం మీద దాడి జిరగిన ఉదంతంపై పోలీసులు విచారణ ముమ్మరం చేయటం తెలిసిందే. తాజాగా ఈ కేసును విచారిస్తున్న మంగళగిరి పోలీసుల ఎదుట వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన సజ్జల రామక్రిష్ణారెడ్డి హాజరు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఒక సీన్ హాట్ టాపిక్ గా మారింది. హైప్రొఫైల్ వ్యక్తుల్ని విచారించే వేళలో.. పోలీసులు ఎంత పక్కాగా వ్యవహరిస్తారో తెలిసిందే. కోర్టు అనుమతులు వగైరా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. సజ్జలను విచారించే వేళలో.. ఆయనతో పాటు తనను కూడా అనుమతించాలన్న మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అనుమతించే విషయంలో పోలీసులు నో చెప్పారు.
తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. ఒకవేళ మీరు ఏమైనా అనుమతులు తెచ్చుకొని ఉంటే.. ఆ పత్రాల్ని చూపిస్తే లోపలకు అనుమతిస్తామని చెప్పారు. దీనికి తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పొన్నవోలు పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేసేందుకు వెనుకాడలేదు. కోర్టు అనుమతి లేకుండా విచారణకు అనుమతించమని.. బయటకు వెళ్లాలని ఎస్ఐ వెంకట్ ఆయనకు సూచించారు.
దీంతో పొన్నవోలు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. తననే బయటకు వెళ్లమంటావా? అంటూ మండిపడిన ఆయన.. ‘మాకూ ఒక రోజు వసతుంది. అప్పుడు మీ సంగతి చెబుతా’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోపంతో ఊగిపోయిన ఆయన ఆవేశానికి పోలీసులు బిత్తరపోయారు. ఆయన మాటలు విని లోపలకు అనుమతిస్తే.. కోర్టు నుంచి తమకు సమస్యలు ఎదురు కావా? ఈ చిన్న విషయాన్ని ఎందుకు అంత పెద్దోళ్లు ఎందుకు మిస్ అవుతారు? అంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సజ్జల విచారణ వేళ.. పొన్నవోలును అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇస్తే.. వాటిని అమలు చేయటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న సదరు పోలీసు అధికారి.. పొన్నవోలు వార్నింగ్ ఇచ్చేయటం సరికాదన్నారు. మరోవైపు.. పోలీసుల తీరుకు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పొన్నవోలు.. రాష్ట్రంలో రాజ్యాంగం లేదని.. పౌరుల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఒక సంచలన కేసుకు సంబంధించిన విచారణకు న్యాయస్థానం అనుమతి లేకుండా ఎవరిని పడితే వారిని ఎలా అనుమతిస్తారు? అదనపు అడ్వొకేట్ జనరల్ గా పని చేసిన పొన్నవోలుకు ఆ చిన్న విషయం ఎందుకు తెలీటం లేదు చెప్మా?