వంద ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ పై చర్యలు మొదలయ్యాయి.
ఆరోపణలు చేసినంతనే భావోద్వేగానికి గురై.. తన పదవికి రాజీనామా చేస్తారన్న అంచనాలో ఉన్నప్పటికి.. అందుకు భిన్నంగా ఈటల మాత్రం తనను.. ఎంత అవమానించాలో అన్ని అవమానాలు పార్టీలోనే పడాలన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
దీనికి తగ్గట్లే.. సీఎం కేసీఆర్ ప్లాన్ లోనూ కాస్త మార్పు ఉంటుందని చెబుతున్నారు. మంత్రి పదవికి ఈటల తనకు తానుగా రాజీనామా చేస్తే.. తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త తీసుకుందామని అనుకున్నా.. అలాంటి పరిస్థితి లేదు.
దీంతో.. సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. మొదటి ఎత్తులో ఈటల వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను తనకు బదిలీ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సాంకేతిక అంశాల విషయంలో స్పందించాల్సిన గవర్నర్.. వెంటనే ఓకే చెప్పేసింది.
దీంతో.. మంత్రి పదవిలో ఉన్న ఈటలకు ఇప్పుడు ఏ శాఖ లేకుండా పోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. అందులోని అంశాల ఆధారంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినట్లుగా లీక్ వస్తుందని చెబుతున్నారు.
దీంతో.. తన పదవికి ఈటల రాజీనామా చేసే వీలుందని.. అలా మంత్రి పదవి నుంచి దూరమయ్యాక.. ఆవేశంతో కానీ ఆగ్రహంతో కానీ ఈటెల రియాక్టు అయితే.. వెంటనే పార్టీ నుంచి వేటు వేసే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఈటల ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై ఇప్పటికే హోంవర్కు చేసినట్లు చెబుతున్నారు.
ఈ కారణంతో.. తనను ఏమన్నా కానీ ఆదేశాన్ని ప్రదర్శించకుండా ఆచితూచి అన్నట్లుగా రియాక్ట్ అవుతారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. మంత్రిత్వ శాఖను బదిలీ చేయడంతో మొదలైన రియాక్షన్.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.