దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కవితతోపాటు ఆమె భర్త అనిల్, లాయర్ మోహన్ రావు కూడా ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. కానీ, ఆ ఇద్దరినీ ఈడీ అధికారులు బయట ఆపేయడంతో కవితకు షాక్ తగిలింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల బృందం కవితకు షాకిచ్చేలా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
కవిత కోసం 26 ప్రశ్నలను ఈడీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144ని విధించారు. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా దూరంగా వెళ్లమని పోలీసు అధికారులు చెబుతున్నారు. దాదాపు 3 గంటలుగా కవిత విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతోనే కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్ మెంట్ను రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరాల సమాచారం ఆధారంగా విచారణ కొనసాగుతోంది. సిసోడియా, పిళ్లైలతోపాటు కలిపి కవితను ప్రశ్నించే అవకాశముందని ముందు ప్రచారం జరిగింది. కానీ, చివరకు విడివిడిగానే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.