సినీ తారల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలకు అభిమానగణం చాలా అధికం. తమ ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేయడానికి వెనుకాడని డై హార్డ్ అభిమానులు కూడా ఉంటారు. అటువంటి డై హార్డ్ ఫ్యాన్ ఒకరు చనిపోయే ముందు ఏకంగా రూ. 72 కోట్లు విలువ చేసే ఆస్తిని తన అభిమాన హీరో, బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ కు రాసిచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయం అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలకు వెళ్తే..
ముంబై కి చెందిన నిషా పాటిల్(62) నటుడు సంజయ్ దత్ కు వీరాభిమాని. గృహిణిగా ఉన్న ఆమె సంజయ్ దత్ సినిమాలను ఎక్కువగా చూసేది. ఆయన నటనా నైపుణ్యానికి ఆకర్షితురాలైన నిషా పాటిల్.. సంజయ్ దత్ కు డై హార్డ్ ఫ్యాన్ గా మారిపోయింది. వ్యక్తిగతంగా కలవకపోయినా ఎప్పుడూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేది. కొన్నేళ్ల క్రితం నిషా పాటిల్ అనారోగ్యం పాలైంది. అయితే తన మరణాన్ని ముందే గ్రహించిన నిషా.. 2018లో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
తన పేరిట ఉన్న రూ. 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ కే దక్కేలా వీలునామా రాసింది. అలాగే తన డబ్బు, నగలు, ఆస్తి పత్రాలన్నీ సంజయ్ దత్ కి బదిలీ చేయాలని చనిపోయే ముందే బ్యాంకులకు ఆమె లెటర్స్ కూడా రాశారు. ఇక ఇటీవలె నిషా పాటిల్ అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో వీలునామా ప్రకారం.. ఆమె పేరిట ఉన్న ఆస్తి మొత్తం సంజయ్ దత్ కి ట్రాన్స్ఫర్ అయింది. ట్విస్ట్ ఏంటంటే.. అభిమాని నుంచి వచ్చిన ఆస్తిని సంజయ్ దత్ రిజెక్ట్ చేశావు.
అవును, బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా విషయం తెలుసుకున్న నటుడు సంజయ్ దత్ ఆశ్చర్యానికి గురయ్యారు. నిషా పటేల్ ఎవరో కూడా తనకు తెలియదని.. ఆమె ఆస్తి తనకు వద్దని సంజయ్ దత్ సున్నితంగా తిరస్కరించారు. అభిమాని నుంచి పొందే అభిమానం కన్నా గొప్ప ఆస్తి మరేది ఉండదు.. ఆమెను కలవనందుకు ఎంతో బాధగా ఉందని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఇక ఆమె రాసిచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని వారి కుటుంబ సభ్యులకే చెందేలా సంజయ్ దత్ ఒక లీగల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. సంజయ్ దత్ నిర్ణయం పట్ల సినీ ప్రియులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.