ఈ టెక్ జమానాలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, ఓటీపీ వివరాలు ఎవరికి పడితే వారికి షేర్ చేయొద్దంటూ సైబర్ పోలీసులు ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ…చాలామందిని సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులుగా మారి లక్షలు పోగోట్టుకుంటున్నారు. ఈ ప్రచారం వల్ల కొద్ది మందిలో ఓటీపీ షేరింగ్ పై అవగాహన వచ్చిందనుకుంటున్న తరుణంలో ఈ కేటుగాళ్లు కొత్త మోసానికి తెరతీస్తున్నారు.
సగం ధరకే జీడిపప్పు, బాదం, పిస్తా వంటి ఖరీదైన ఐటంలను డోర్ డెలివరీ చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ కేటుగాళ్ల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబరాబాద్ సైబర్ పోలీసులు. కిలో బాదంపప్పు రూ.300లు..మార్కెట్ రేటుకంటే సగం తక్కువ…లిమిటెడ్ టైం ఆఫర్ అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం ఈ గ్యాంగ్ మోడస్ ఆపరెండి. ఆర్డర్ చేసిన దానిలో 50శాతం డబ్బు ముందుగా చెల్లిస్తే..రెండుగంటల్లో హోమ్ డెలివరీ అంటూ యాడ్ ఇస్తున్నారు.
ఇక, మినిమం ఆర్డర్ రెండువేలు ఉండాలని చెప్పడంతో చాలామంది ఈ ఆపర్ కు టెంప్ట్ అవుతున్నారు. కరోనా కాలంలో చీప్ అండ్ బెస్ట్ డీల్ కొట్టేసి కాస్త ఇమ్యూనిటీ పెంచుకుందామని సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేస్తున్నారు. అంతేకాదు, వారు సూచించిన బ్యాంక్ ఖాతాల్లో సగం నగదు జమ చేస్తున్నారు. ఆ తర్వాత తమకు ఇచ్చిన నెంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
భరత్పూర్ సైబర్ నేరస్థులే ఈ తరహా మోసాలు చేస్తున్నారని, ఫేస్బుక్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ప్రకటనలు పోస్ట్ చేసే వారిలో 95శాతం వీరే ఉంటారని సైబర్ పోలీసులు అంటున్నారు. మెల్టింగ్ హార్ట్స్ పేరుతో యాడ్స్ ఇస్తుంటారని చెబుతున్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో మద్యం డోర్ డెలివరీ అంటూ ప్రముఖ మద్యం దుకాణాల పేర్లతో ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే క్యాష్ ఆన్ డెలివరీ కావాలని డిమాండ్ చేయాలని, అప్పుడు నకిలీ రాయుళ్ల గుట్టు రట్టవుతుందని చెబుతున్నారు.