తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా? పాలన గాడితప్పుతోందా? ఇదే చర్చ నెటిజన్ల మధ్య సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో కానీ.. కరోనా బాధితులకు వైద్యం అందించడంలోను, కేసులను వెల్లడించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్యం, తదితర అంశాలపై హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానిస్తోంది.
ఇప్పటికే కరోనాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ.. నిలదీసిన.. హైకోర్టు.. వరుస పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. నివేదికలు ఇవ్వాలని.. కోర్టుకు రావాలని.. ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
హైకోర్టు వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. వెంటనే నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే.. ఈ కర్ఫ్యూ కూడా శుక్రవారంతో ముగియనుంది. ఇక, ఇప్పుడు మరోసారి హైకోర్టు ఎంటర్ అయింది. ఏం చేస్తున్నారంటూ.. ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసింది.
రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.. తదుపరి చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. నియంత్రణ చర్యలపై తామ ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల ని సూచించింది.
ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతాన ని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అయితే.. ఈ అంశాలను గమనిస్తున్న ప్రజలు.. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందా? అనే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.