సరదా పేరుతో సోషల్ మీడియాలో యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు సైకోయిజం షాకింగ్ గా మారింది. ఒక చిన్నారి.. తన తండ్రితో ఆడుకునే వీడియోలోనూ వికృతంగా చూసే వైనం చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కలలో కూడా ఊహించుకోవటానికి ఇష్టపడని అంశాల్ని.. ఓపెన్ గా తన లాంటి మరో ముగ్గురు సైకోగాళ్లను కూర్చోబెట్టుకొని ముచ్చట్లు పెట్టిన తీరు.. వాటిని చూసిన కొందరికి మతి పోయింది. వెనుకా ముందు చూసుకోకుండా హాస్యం పేరుతో వారు మాట్లాడే మాటల్ని చూస్తే సోషల్ మీడియా సైకోగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు.
సోషల్ మీడియాలో ఒక తండ్రి పోస్టు చేసిన వీడియోను పట్టుకొని.. చిన్నారిపై చేసిన వ్యాఖ్యలు.. హన్మంతు అతడి స్నేహితులు చేసిన వ్యాఖ్యలు కంపరంతో పాటు.. మనసంతా జగుప్సతో నిండుతుంది. సున్నిత మనస్కుల్ని మరింత దారుణ ప్రభావాన్ని చూపే పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్.. తొలుత ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లటంతో ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలో అర్థమైంది.
సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా.. ప్రమాదకరంగా మారిందన్న వేదనను వ్యక్తం చేస్తూ.. దాన్ని నియంత్రించటం కష్టం కాబట్టి.. సోషల్ మీడియాలో తమి పిల్లలు చూసే ఫోటోలు.. వీడియోల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలిన కోరారు. ఇలాంటి నీచుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మరో హీరో మంచు మనోజ్ కూడా స్పందించారు. ఆయన కూడా సాయి ధరమ్ తేజ్ మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేయటంతో ఆగకుండా.. టెక్సస్ అధికారులు.. యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేసి హన్మంతుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హాస్యం పేరుతో సోషల్ మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరంగా ఉందంటూ పేర్కొన్న మంచు మనోజ్.. డేంజర్ అన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ‘అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను. చైల్డ్ సేఫ్టీపై ఏడాది క్రితం అతడ్ని ఇన్ స్టాలో సంప్రదించా. అతను స్పందించలేదు. ఇప్పుడు అతడే పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతో పాటు అసహ్యమేస్తోంది’ అని పేర్కొన్నారు.
మరో హీరో నారా రోహిత్ సైతం ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ హన్మంతు మీద చర్యలు తీసుకోవాలన్నారు. పలువురు ప్రముఖులు.. సెలబ్రిటీలు హన్మంతు చర్యను తీవ్రంగా ఖండిస్తున్న వేళలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ.. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. హన్మంతుపై తగిన చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ స్పందనకు తగ్గట్లే తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఎక్స్ వేదికగా రియాక్టు అయ్యారు. ప్రణీత్ హన్మంతుతో పాటు మిగిలిన ముగ్గురిపైనా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హాస్యం పేరుతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. హాస్యం పేరుతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్న ఆమె.. హన్మంతు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హన్మంతు సైకో హాస్యంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కం సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ తండ్రికూతుళ్ల విషయంలో యూట్యూబర్లు ఇలా ప్రవర్తించటం.. కామెంట్స్ చేయటం నీచమైన అంశంగా పేర్కొంటూ.. వారంతా ఏ మాత్రం సిగ్గు.. భయం లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయటాన్ని తప్పు పట్టారు.
ఈ వ్యవహారంపై కేంద్ర మహిళా.. శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ స్పందించి.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరో సీనియర్ నటి రేణుదేశాయ్ సైతం స్పందించారు. హన్మంతు తీరును తప్పు పట్టారు. ‘ఆ నీచున్ని జైల్లో వేసి చితక్కొట్టాలి. ఇలాంటి వారిని సపోర్టు చేస్తున్న వారిని కూడా అరెస్టు చేసి జైల్లో వేయాలి’ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా గతంలో హన్మంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా సారీ చెప్పారు. సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చానని.. అందుకు తానిప్పుడు పశ్చాత్తాపడుతున్నట్లుగా పేర్కొన్నారు.
మరో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందిస్తూ.. ఆయన కూడా క్షమాపణలు చెప్పారు. తన హరోంహర సినిమాలో అతడ్ని భాగం చేసుకున్నందుకు తనను క్షమించాలన్నారు. మరో హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందన్నారు. తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న వేళ.. హన్మంతు ఒక వీడియోను విడుదల చేశాడు. భేషరతు క్షమాపణలు చెబుతూ.. తాను కావాలని అలా మాట్లాడలేదని.. హాస్యం కోసం ఇలా చేస్తే.. గీత దాటినట్లుగా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
ఐఏఎస్ అధికారి కుమారుడైన హన్మంతు తాను విడుదల చేసిన వీడియోలో పేర్కొన్న ఒక విషయాన్ని ప్రస్తావించిన తీరు చూస్తే.. తన వరకు.. తన కుటుంబం వరకు వస్తే తెలిసే నొప్పి ఎంతన్న విషయాన్ని చెప్పేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని.. దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని పేర్కొన్నాడు. ఒక తండ్రి తన చిన్నారి కుమార్తెతో తీసుకున్న వీడియోతో.. సైకో మాటలు మాట్లాడిన.. తన లాంటిమరో ముగ్గురితో బేవార్సు మాటలు మాట్లాడుకున్నప్పుడు.. వారికో కుటుంబం ఉంటుందని.. తాము సభ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారు?
ఆ వీడియోపై తాను చేసిన వ్యాఖ్యలను సదరు తండ్రి.. కుమార్తెలకు తెలిస్తే వారి మానసిక పరిస్థితేంటి? తాను.. తన కుటుంబం బాగుండాలి కానీ మిగిలిన వారు ఎలా పోయినా ఫర్లేదా? తన కుటుంబ సభ్యులను తాజా వివాదంలోకి లాగొద్దంటున్న హన్మంతు ఒక పాయింట్ ను మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. అతడికి ఫేం వస్తే వారి కుటుంబ సభ్యులకు వచ్చే ఇమేజ్ ఎలాంటిదో.. ఈ తరహాలో తప్పుడు మాటలు మాట్లాడినప్పుడుజరిగే డ్యామేజ్ ను సదరు కుటుంబ సభ్యులు భరించాల్సిందే. కట్టుదాటే వారికే కాదు.. వారితో బంధం.. అనుబంధం ఉన్నందుకు మిగిలిన వారికి తిప్పలు తప్పవు. అందుకే.. నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించటం మంచిది. తన కుటుంబ సభ్యుల గురించి విలవిలలాడిపోతున్న అతగాడు.. కోట్లాది మంది మనసుల్ని నొప్పించినందుకు ఉత్త క్షమాపణలు సరిపోతాయా? ఇలాంటి వారి విషయంలో చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.