మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారం నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయడం తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఈ రోజు అసెంబ్లీ ని కుదిపేసింది. ఆ అంశంపై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. దీంతో, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించడం సంచలనం రేపింది.
శంకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పొంగులేటిపైకి బీఆర్ఎస్ సభ్యులు దూసుకువెళ్లారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత స్పీకర్ పోడియం మెట్లపైకి హరీష్రావు వెళ్లడం, స్పీకర్ పై కొందరు బీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. సభలో ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకోవడంతో రసాభాసగా మారింది. శాసన మండలిలోనూ ఇరు పార్టీల సభ్యులు గందరగోళం సృష్టించారు.