తమది పేదల ప్రభుత్వం అని ….సీఎం జగన్ పేదల పాలిట పెన్నిధి అని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. నాటి ప్రతిపక్ష నేత జగన్ తన పాదయాత్రలో తారసపడిన పేదలపై ముద్దుల వర్షం కురిపించడంతో జనం కూడా జగన్ తమ పక్షమే అనుకున్నారు. అయితే, అదంతా ఎన్నికల స్టంట్ అని…అధికారం చేతికి వచ్చిన తర్వాత ముద్దులకు బదులు పిడిగుద్దులు దక్కుతాయని జనం ఊహించలేదు.
ఇలా షాక్ లో ఉన్న జనానికి జగన్ రెడ్డి తాజాగా మరో షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది తాడేపల్లిలోని తన నివాసం చుట్టుపక్కల ఉన్న పేదల గూడును జగన్ పెకిలించాలని చూస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 30 ఏళ్లుగా తాము ఇదే ప్రాంతంలో నివాసముంటున్నామని, ఇప్పుడు ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళతామని అంటున్న వారి గోడును పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాడేపల్లి కాలవ కట్ట సమీపంలో అమరారెడ్డి నగర్లో 318 పేద కుటుంబాలు గత 30 ఏళ్లుగా నివాసముంటున్నాయి. అయితే, రెండేళ్ల క్రితం నాటి ప్రతిపక్ష నేత జగన్…ఈ ఇళ్ళ మధ్యే తన రాజ ప్రాసాదాన్న నిర్మించుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత తమ ఇళ్ల మధ్యే ముఖ్యమంత్రి ఇల్లు ఉందని అక్కడి జనం మురిసిపోయారు. అయితే, ఆ మురిపెం మూన్నాళ్ల ముచ్చటే అవుతుందని వారు ఊహించలేదు.
భద్రతా కారణాల సాకు చెప్పిన అధికారులు…అక్క పక్కన పేదల ఇళ్లు ఉండడానికి వీలులేదనే ఆలోచనతో వాటిని ఖాళీ చేయించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ‘సీఎం భద్రత’ అనే కోణంలో అధికారులు పేదలకు నచ్చజెబుతున్నారని, సీఎం నివాసం సమీపంలో పేదలు నివాసం ఉండటమే ప్రధాన అభ్యంతరం అని అక్కడి స్థానికులు అంటున్నారు.
నిబంధనల ప్రకారం అక్కడి నివాసితులకు బహిరంగంగా నోటీసులు ఇస్తే గొడవ అవుతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా నచ్చజెబుతున్నారని తెలుస్తోంది. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద 2 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని స్థానికులకు ఆశ కల్పించి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే, వారు ఇస్తానన్న స్థలంలో డ్రైనేజీ, రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని, అందుకే అక్కడకు తరలివెళ్లేందుకు పేదలు అంతగా సుముఖంగా లేరని తెలుస్తోంది. స్థలం ఇచ్చినా ఇళ్లు కట్టుకోవడానికి 6 నెలలు సమయం పడుతుందని, సీఎం కోసం ఇప్పటికిపుడు ఖాళీ చేసి ఎక్కడకు వెళ్లాలని వారంతా వాపోతున్నారు. ఖాళీ చేయడానికి కనీసం ఆరు నెలలైనా సమయం ఇవ్వాలని అర్థిస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.