సంచలనాల సీఎంగా మారిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఒక చిన్నారి వీడియోకు ఆయన రియాక్టు అయ్యారు.
చిన్న వయసులోనే రెండు కిడ్నీలు పాడైపోయి.. తన తల్లి దానం చేసిన కిడ్నీ కూడా పని చేయకపోవటంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తాను డయాలసిస్ బాధను భరించలేకపోతున్నానని.. నరకం అనుభవిస్తున్నట్లుగా పేర్కొన్న ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు.
‘అందరూ నేను చనిపోతానంటున్నారు. కానీ నాకు బతకాలని ఉంది. నన్ను కాపాడే అవకాశం ఉందా? సాయం చేయండి సార్’ అంటూ సేలంకు చెందిన జనని అనే బాలిక చేసిన వినతికి స్టాలిన్ స్పందించటమే కాదు.. ఆమెను చెన్నైలోని స్లాన్లీ ఆసుపత్రిలో చేర్పించారు.
అంతేకాదు.. తానే స్వయంగా వెళ్లి చిన్నారిని పరామర్శించటమే కాదు.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. హాట్ టాపిక్ గా మారింది.
ఆదుకోవాలంటూ వినతులు చేసుకోవటం.. వాటికి కొన్నిసార్లు అధికారులు స్పందించటం ఒక ఎత్తు అయితే.. ఇంతలా రియాక్టు కావటం సీఎం స్టాలిన్ ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు.
తన తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ డయాలసిస్ చేయిస్తున్నారని.. బాధను తట్టుకోలేకపోతున్నట్లుగా కన్నీటి పర్యంతమైన ఆమెను పరామర్శించిన సీఎం.. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పటం గమనార్హం. దీనికి ముందు ఉన్నతాధికారులు చిన్నారి ఇంటికి వెళ్లి.. ఆమెను చెన్నైకు తరలించి.. ఐసీయూలో ఉంచి చికిత్స చేయించారు.
అనంతరం సీఎం స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన వైనం ఇప్పుడు ఆయన గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది