నల్గొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకనీకి పోయినవ్ అని కేసీఆర్ అడుగుతున్నారని, గత ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ అంగీ పీకేశారని, ఇట్లాగే మాట్లాడితే ఆయన ప్యాంటు కూడా ఊడదీస్తామని షాకింగ్ కామెంట్లు చేశారు.
కాళేశ్వరం అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని, చంపుతరా అంటూ ప్రశ్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ చచ్చిన పాము అని, చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్ అనే పామును చంపేశారని చురకలంటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్ నేతలకు బుద్ధిరాలేదని మండిపడ్డారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి లేదని, అలా చేస్తామంటే ఆ బాధ్యతలను మొన్నటి వరకు ఆ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రులకే అప్పగిస్తామన్నారు.
ప్రాజెక్టులలో అవినీతిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోయి ఫాంహౌస్ లో పడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా సభకు హాజరు కాకుండా కాలు నొప్పి అని చెబుతున్నారని, కానీ, నల్గొండలో రాజకీయ సభకు హాజరయ్యారని మండిపడ్డారు.