బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఉదయం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సీఎం నితీష్ కుమార్.. పట్టుమని నాలుగు గంటలు కూడా తిరగకుండానే.. సాయంత్రం మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో ఏర్పడిన నితీష్ ప్రభుత్వం.. ఇలా.. ఈ నాలుగేళ్ల కాలంలో రాజీనామాలు.. ప్రమాణాలు చేయడం ఇది మూడో సారి. తొలిసారి కొత్త ముఖ్యమంత్రిగా 2021లో ప్రమాణం చేసిన నితీష్.. 2022లో అనూహ్యంగా రాజీనామా చేసి బీజేపీతో బంధం తెంచుకున్నారు.
ఆర్జేడీతో జతకట్టి.. అధికారం చేపట్టారు. మళ్లీ.. అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి.. మహాఘట్ బంధన్ సర్కారు ఏర్పాటు చేశారు. అంటే.. అప్పటికి రెండు సార్లు అయింది. తాజాగా మరోసారి రాజీనామా.. ఆ వెంటనే ప్రమాణం చేసి.. మరో రికార్డు సృష్టించారు. మొత్తంగా రాష్ట్ర చరిత్రంలో 9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. మహాఘట్బంధన్ నుంచి బయటకు వచ్చిన నితీశ్.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం బీజేపీకి 78 అసెంబ్లీ సీట్లు ఉండగా.. నితీష్‌కు కేవలం 45 స్తానాలు మాత్రమే ఉన్నాయి. వీరికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 122, అయితే.. ఈ కూటమికి ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క సీటు అదనం. ఆదివారం ఉదయం గవర్నర్‌కి తన రాజీనామా లేఖను సమర్పించిన నితీశ్.. ఆ తరవాత బీజేపీ మద్దతునిస్తూ ప్రకటించిన లేఖని ఆయనకు అందించారు. ఈ రెండు లేఖలనీ గవర్నర్ ఆమోదించడం కేవలం గంటల వ్యవధిలోనే అయిపోయింది. ఈలోగా రాజ్‌భవన్ సుందరీకరణ కూడా పూర్తి చేశారు.
ఇలా ఇంటికి వెళ్లి.. అలా భోజనం చేసి మళ్లీ రాజ్‌భవన్‌కు వచ్చిన నితీశ్.. వెంటనే ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం నితీశ్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో బీజేపీ నేత విజయ్ సిన్హా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరపున బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 8 మందిని మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.