బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి, మహిపాల్ రెడ్డి, ముకేష్ కుమార్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే సీఎంను గౌరవ, మర్యాదపూర్వకంగా కలిశామని వారు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. ఇక, తాను సీఎంను బరాబర్ కలుస్తానంటూ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
రేపు మాపో మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పుకార్లు వస్తున్నా..తాను కూడా నియోజకవర్గం కోసమే ముఖ్యమంత్రిని కలుస్తానని, అందులో తప్పేంటని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డిని, మంత్రులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవొచ్చని, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పారు. వారిని కలిసే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.
ఇక, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరో చెప్పిన మాటలు విని వారి ట్రాప్ లో పడవద్దని హితవు పలికారు. సదుద్దేశంతో అధికార పార్టీ నేతలను కలిసినా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ హెచ్చరించారు. జనం మధ్య ఉన్నప్పుడే మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ ను బొంద పెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారని, వాటిని ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఓటమితో నీరస పడవద్దని, కాంగ్రెస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ హామీలను అమలు చేసే పరిస్థితి లేదని ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్నది వాళ్ళ చేతిలోనే ఉందని చెప్పారు. అయితే, ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు.