టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ నాయకుల్లాగా మారొద్దని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సూచించారు. నోరు విప్పితే బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అనుకున్న వారిని ప్రజలు.. ఆరు అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలాగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించవద్దని తెలిపారు. బూతులు మాట్లాడడం సభ్యత కాదన్నారు. ప్రజల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవమరించాలని సూచించారు.
“మనం కళ్లుమూసుకుని ఉన్నామని ప్రజలు కళ్లు మూసుకోరు. ఎప్పుడూ మనలను డేగకళ్లతో పరిశీలిస్తూ నే ఉంటారు. తప్పు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. తప్పుల జోలికి వెళ్లొద్దు. వైసీపీ అనుభవాలన్నీ.. జాగ్రత్తగా గమనించండి. ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి సమస్యల విషయంలో స్పందించేలా ఉండాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి“ అని సీఎం చంద్రబాబు సూచించారు.
తాజాగా ఏసీ అసెంబ్లీ ఆవరణలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తొలి సారి ఎన్నికైన వారికి, రెండో సారి ఎన్నికైన వారికి ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అనుభవాలను పంచుకున్నారు. సభలో ఎలా వ్యవహరించాలో చెప్పారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడం ద్వారానే నియోజకవర్గంలో పునాదులు బాగా పడతాయని చెప్పారు. నేడు పెరిగిపోయిన సాంకేతిక విప్లవం.. ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామో.. ప్రజలకు చెబుతోందన్నారు.
ఏదో సభకు వచ్చాం.. కాఫీ తాగాం వెళ్లాం.. అన్నట్టుగా ఎవరూ ఉండొద్దని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలన్నారు. తద్వారా మరింతగా ప్రజాదరణ పొందేందుకు నియోజకవ ర్గంలో పేరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఇతర విషయాల్లోకి వేలు పెట్టకుండా.. ప్రజలకు అవసరమైన వాటిని వదిలి పెట్టకుండా ముందుకు సాగాలని పేర్కొన్నారు.