టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఓ కీలక విషయాన్ని తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమే అయినా.. అందరికీ అర్థం కావాలని అనుకున్నారో..లేక.. అందరికీ తెలియాలని అనుకున్నారో.. మొత్తానికి కీలక విషయాన్ని బహిరంగ వేదికపైనే చెప్పేశారు. అదే.. వైసీపీ కార్యకర్తలకు పాలు పొయుద్దు.. వారు పాముల వంటివారు అని! దీనిలో చాలా లోతైన అర్థం ఉంది. అయితే.. టీడీపీ నాయకులకు ఎలా అర్ధమైందో ఏమో, దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు మాత్రం పడుతున్నాయి. ప్రస్తుతం పలు కీలక పథకాలకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది.
ఇప్పటి వరకు జరిగిన పథకాలు ఒక ఎత్తయితే.. ఇక నుంచి మాత్రం మరింత కీలకమైన రెండు పథకాలకు శ్రీకారం చుడుతున్నా రు. వీటిలో 15000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకం అత్యంత కీలకమైంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఈ పథకం కింద నిధులు ఇస్తామన్నారు. అంటే.. ఈ పథకంలో ఎవరైనా లబ్ధి దారులుగా గుర్తిస్తే.. ఆ ఇంట్లో 30000 వేల రూపాయల చొప్పున వచ్చి పడతాయి. ఎందుకంటే.. కనీసం ఇద్దరు పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. పైగా ఒక్క రూపాయి కూడా.. రూ.15000లలో కట్ చేసే ప్రసక్తి లేదని అధికారులు చెబుతున్నారు.
ఇంత కీలకమైన పథకాన్ని పార్టీ కార్యకర్తలు, నిజమైన లబ్ధిదారులకు అందించాలన్నది చంద్రబాబు వ్యూహం. అదేవిధంగా రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా.. హైలెట్ . ఇది కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతోంది. దీనికింద ఏకంగా.. రూ.20000 చొప్పున రైతులకు జమ కానున్నాయి. దీనిలో కేంద్రం ఇచ్చే 6000 పోను.. మిగిలిన 14 వేలను రాష్ట్రం అందించనుంది. ఈ క్రమంలో దీనిని కూడా నిజమైన లబ్ధిదారులకు అందించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. అందుకే.. ఆయన వైసీపీకి పాలు పోస్తే.. పాముకు పోసినట్టే అని వ్యాఖ్యానించారు.
ఎందుకు..?
ప్రస్తుతం ఉన్న లబ్దిదారుల్లో చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే వాదన ఉంది. దీనికి టీడీపీ నాయకులే సహకరిస్తున్నారన్న చర్చ కూడా పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీకి అనుకూలంగా ఉండేవారికి ఎలా లబ్ధి చేకూరుస్తామని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై గతంలోనూ చర్చ జరిగింది. అయితే.. నాయకులు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు కీలకమైన పథకాలు కావడం.. భారీ ఎత్తున ఆర్థిక లబ్ధి జరుగుతున్న క్రమంలో చంద్రబాబు బాగానే అలెర్ట్ అయ్యారు. టీడీపీకి చెందిన వారిని ఎంతమందిని లబ్ధిదారులుగా చేర్చినా..ఇబ్బంది లేదని.. వైసీపీకి అనుకూలంగా ఉండేవారిని ఎలా లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామన్న ఉద్దేశాన్ని తమ్ముళ్లు అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని సీనియర్లు కూడా చెబుతున్నారు.