తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు దురదృష్టవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆవిడను లోపలికి తీసుకువచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. తమ కోసం గేట్లు తెరిచారని భక్తులు భావించి ఒక్కసారిగా లోపలికి రావడంతో ఈ ఘటన జరిగిందని కొందరు భక్తులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నేడు పరిశీలించారు.
తిరుపతిలోని బైరాగిపట్టెడ దగ్గర ప్రమాదస్థలికి చంద్రబాబు వెళ్లారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అనిత, సత్యకుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులతో కలిసి ఆ ప్రాంతంలో ఘటన జరిగిన తీరును, కారణాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేటు తీయకముందు పరిస్థితి అదుపులో ఉందని, గేటు తీసిన తర్వాత తొక్కిసలాట జరిగిందని చంద్రబాబుకు శ్యామలరావు చెప్పారు. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో మీకు తెలియదా? అని శ్యామల రావును చంద్రబాబు ప్రశ్నించారు. 2 వేల మంది పట్టే చోట 2,500 మందిని ఎలా ఉంచారని ప్రశ్నించారు. పరిమితికి మించి భక్తులను ఎందుకు అనుమతించారని నిలదీశారు. పద్ధతిగా పని చేయడం నేర్చుకోవాలని , తమాషా అనుకోవద్దు అని మండిపడ్డారు. ఏ బాధ్యత తీసుకున్నవారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు.
కొత్త ప్రదేశంలో టికెట్ల పంపిణీ జరుగుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని, అక్కడి పోలీసు అధికారికి ముందస్తు జాగ్రత్తలు సరిగ్గా వివరించాలని అన్నారు. ఇంతమంది ఉండి టికెట్ల పంపిణీ సరిగా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. ముందే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్మినిష్ట్రేషన్ అంటారని, ప్రమాదం జరిగిన ఏం చేసినా..ఎంత చేసినా ఉపయోగం లేదని అన్నారు.భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.