హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లను ఆయన ఆరోగ్యం గురించి వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ తో కొద్దిసేపు సంభాషించిన చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గారికి హిప్ ఆపరేషన్ జరిగిందని, ఆయన కోలుకొని నడిచేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ కు ఫిజియోథెరపీ కూడా అవసరమని వైద్యులు సూచించినట్టుగా చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవ చేసేందుకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయని, కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని అన్నారు. కేసీఆర్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెట్లు ఎక్కడం, ఇతర పనులు వంటివి చేసుకోవచ్చని వైద్యులు చెప్పినట్టుగా చంద్రబాబు అన్నారు. కేసీఆర్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజా సేవకు ఆయన రావాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు, కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని చిరంజీవి అన్నారు. ఆరు వారాల్లో కేసీఆర్ కోలుకుంటారని, సర్జరీ అయిన 24 గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూశారని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని చిరంజీవి ఆకాంక్షించారు. కేసీఆర్ తో మాట్లాడుతున్నప్పుడు సినీ పరిశ్రమ గురించి తనను అడిగారని, సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలా ఉంది అని ప్రశ్నించారని చిరంజీవి చెప్పారు కేసీఆర్ ను చిరంజీవి పరామర్శించే సమయంలో కేటీఆర్, కవిత అక్కడే ఉన్నారు.
తుంటి ఎముక శస్త్ర చికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద ఆసుపత్రిలో పరామర్శించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు.#Ncbn pic.twitter.com/ALx8JJ5S28
— Telugu Desam Party (@JaiTDP) December 11, 2023