ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలారోజులుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా చంద్రబాబు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. టీడీపీలో క్రియాశీల బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరిపై రెండు సర్వేలు నిర్వహిస్తామని, ఆ సర్వేల ఆధారంగా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని గ్రహించి తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 15 మంది కీలకమైన నేతలతో తన నివాసంలో చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. ప్రజల భవిష్యత్తుకు ఆల్రెడీ గ్యారెంటీనిచ్చిన బాబు… పార్టీలోని కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే యాక్షన్ ప్లాన్ రూపొందించారు. బూత్ స్థాయి ఇన్చార్జి నుంచి కార్యకర్త వరకు అందరికీ ప్రాధాన్యత ఇస్తామని, గత 3 ఎన్నికల డేటా ఆధారంగా నియోజకవర్గంలో కార్యచరణ రూపొందించాలన్నారు.
ఇన్చార్జిలు, కార్యకర్తల పనితీరును విశ్లేషించేందుకు 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ ఉంటుందని చెప్పారు.యాక్షన్ ప్లాన్ రూపొందించడం, వాటి అమలుపై ప్రతి నెలా నివేదికలు రూపొందించి హైకమాండ్ కు అందించడం ఆ కమిటీల బాధ్యత అని చెప్పారు. ఈ ప్రక్రియంతా ఆన్ లైన్ లో సాగతుందని తెలుస్తోంది. 4 దశల్లో ప్రతి ఒక్కరి పనితీరును పరిశీలించి పార్టీలో ప్రమోషన్లు, కీలక పదవులు ఇస్తామని అన్నారు. వైసీపీపై వ్యతిరేకతను ఓట్లుగా మార్చడమే ప్రధాన అజెండా అన్నారు.