ఏపీలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి కూటమి గెలుపునకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటమి ఖాయమైందని డిసైడ్ అయిన జగన్…ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చివరి నిమిషంలో బిల్లుల చెల్లింపును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ రాశారు.
నిబంధనలకు విరుద్ధంగా ంతన అనుయాయులైన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయిందని ఆరోపించారు. కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, కొందరు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు సీఎం అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు.
“అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. అయినా, వీటికి చెల్లించకుండా తమకు అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది.’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.