టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ తగ్గిందని, ఆయన ఇక, ఇంటికేపరిమితం కావాలని వ్యాఖ్యానించేవారికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆయన ఇమేజ్ కానీ, ఆయన విజన్ కానీ ఎక్కడా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా.. మరింత నిభిడీకృతం అయిందని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి కారణం.. పనిచేయాలనే తపన.. భవిష్యత్తుపై వ్యూహం.. వంటి కీలకమైన అంశాల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడమే. ప్రజలకు ఏదో ఇద్దాం.. వారిని తనవైపు తిప్పుకొని పబ్బం గడిపేద్దాం.. అనే సంకుచిత భావన బాబులో లేదనేది టీడీపీ నేతల వాదన.
తాజాగా జీ20 సదస్సుకు నేతృత్వం వహించే బాధ్యతలను భారత్ అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సదస్సుల్లో ఏం చే్ద్దాం.. ప్రపంచాన్ని ఎలా ఆకర్షిద్దాం.. అనే చర్చ తెరమీదికి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చూపు.. చంద్రబాబుపై పడిందనే చర్చ ఉంది. అందుకే ఆయనకు సీట్లు ఉన్నాయా.. సభ్యులు ఉన్నారా? అనేది పక్కన పెట్టి.. మరీ పిలిచారు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన మోడీ.. చంద్రబాబు విషయంలో కొన్ని నిబంధనలను పక్కన పెట్టేశారనేది టీడీపీ నేతల మాట.
ఇక, బాబు ఇంత చక్కని అవకాశం దక్కితే.. వదులుకుంటారా? వచ్చే పాతికేళ్లకు ఈ దేశం ఎలా ఉండాలి? ఎలా నడవాలి? ఏదిశగా పయనం ప్రారంభించాలనే బ్లూప్రింట్తో ఈ సభకు హాజరయ్యారు. నిజానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ కానీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కానీ, బెంగాల్ బెబ్బులిగా కీర్తలందుకునే మమతా బెనర్జీ కానీ.. పట్టుమని 10 నిమిషాలు కూడా ఈ సదస్సులో ప్రసంగించలేదు.
కానీ, చంద్రబాబు ధారాళంగా 25 నిమిషాల పాటు దంచికొట్టారు. మొత్తం ఎపిసోడ్లో మోడీని మెస్మరైజ్ చేసింది చంద్రబాబు మాత్రమే అందుకే.. రాత్రికి రాత్రి వారంతా తిరుగుటపాలో వెళ్లిపోయినా.. చంద్రబాబును ఉండాలని మోడీ సూచించి మరీ నీతి ఆయోగ్‌ను కలిసేశారు. కట్ చేస్తే.. చంద్రబాబు విజన్‌కు ఢోకాలేదనే విషయం ఢిల్లీ వేదికగా మరోసారి స్పష్టమైంది. అయితే.. ఎటొచ్చీ అర్ధం చేసుకోవాల్సిందిఏపీ ప్రజలే.. అంటున్నారు పరిశీలకులు.