ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో అత్యంత వైభవంగా రొట్టెల పండుగ జరుగుతోంది. మొహరం పర్వదినాల్లో బారా షహీద్ దర్గా వద్ద హిందూ ముస్లిములు కలిసి కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ మొక్కులు తీర్చుకునే పండగే ఈ రొట్టెల పండుగ. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు పాల్గొంటారు.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను నిర్వహిస్తోంది. రొట్టెల పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులను విడుదల చేసింది. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పండుగ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భక్తులతో మాట్లాడారు.
బారా షహీద్ దర్గాకు చాలా గొప్ప చరిత్ర ఉంది. రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి రొట్టెలు ఇవ్వడం.. ఇదంతా భక్తులు నమ్మకం, వారి నమ్మకం ఎంతో గొప్పదని చంద్రాబు అన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చన్నారు. ఈ పండుగ మహోత్సవం కోసం రూ.5 కోట్లు నిధులు కేటాయించామని.. 20 లక్షల మంది భక్తులు రొట్టెలు పండుగకు వస్తున్నారన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రం అప్పుల్లో ఉంది.. అయినా సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలి… ఖజానా నిండాలి.. అందుకో ఆరు రొట్టెలు వదలమని ఈ సందర్భంగా భక్తులను చంద్రబాబు కోరారు.