ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు నేడు. ఆయన బర్త్‌డే వేడుకులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం టీడీపీ అభిమానులు ఘనంగా జరుపుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వేదికగా చంద్రబాబుకు ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ` నా ప్రియ స్నేహితుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఏపీ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను.` అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ `అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.` అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. `చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ప్రశాంతమైన మరియు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!` అంటూ జగన్ ట్వీట్ చేశారు.
`చంద్రబాబు గారిక 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75 వ జన్మదిన శుభాకాంక్షలు!` అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు.