ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గమని నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో దోపిడీలు, అత్యాచారాలతో పాటు ఇప్పడు హత్యలు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడిని ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్‌కు వెళ్తున్నటీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గమన్నారు. టీడీపీ నేత చలపతి నాయుడుపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
ఎన్నికలంటే వైసీపీ ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. దాడులు చేస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయలేని పోలీసులు… నామినేషన్‌కు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆటవిక అరాచకాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలే అని పేర్కొన్నారు. అభివృద్ధి శూన్యం.. అరాచకం ప్రబలిపోతుందన్నారు. నిన్నటి రోజున మంగళగిరిలో ఒక బాధితురాలిని మానభంగం చేసి హత్య చేస్తే.. దానిని సహజ మరణంగా చిత్రించడం కోసం అధికారపక్షం ప్రయత్నించిందన్నారు. పట్ట పగలు ముగ్గురు వ్యక్తులు కలిసి మానభంగం చేశారు.
నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉందన్నారు. గోపాల పురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ రెండు వర్గాల మధ్య పోరాటంలో ఒక వ్యక్తిని హత్య చేశారు అని తెలిపారు. పట్టపగలు హత్య జరిగినా అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకారంతో ఈ హత్య జరిగిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు? అని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?….అని ఆయన ప్రశ్నించారు.