గుంటూరులో తొక్కిసలాట ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక, అన్నగారి జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మరణించడం విషాదాంతంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రసంగించి ఆ వేదిక పైనుంచి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఈ దుర్ఘటన పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చే సదుద్దేశంతో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని, అందులో తాను పాల్గొన్నానని చంద్రబాబు అన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తాను వెళ్లిన అనంతరం జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. పేదల కోసం ఆ స్వచ్ఛంద సంస్థ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను హాజరయ్యానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ తరఫున అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఈ దుర్ఘటనపై ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు, మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని, గాయపడిన వారికి కూడా వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.