రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు నిన్న తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలు అశేష జనవాహిని మధ్య అశ్రునయనాలతో పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం ఫిల్మ్ సిటీలోని రామోజీ నివాసం నుంచి అంతిమ యాత్రం మొదలై స్మృతివనం వరకూ కొనసాగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు, రామోజీ సంస్థల ఉద్యోగులు రామోజీరావుకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు ఆయన పార్థివదేహం వెంట నడిచారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
తన తండ్రి రామోజీరావుకు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాల మధ్య, పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు జరిగాయి. రామోజీ అంత్యక్రియల్లో ఏపీకి కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్రావు, నామా నాగేశ్వరరావు, వి.హనుమంతరావు, కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
రామోజీ నివాసం నుంచి సాగిన అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు…రామోజీరావు పాడె మోశారు. స్మృతివనం వద్ద రామోజీకి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీ పార్థివదేహానికి చంద్రబాబు ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రతి పనిలోనూ భవిష్యత్తును చూసే స్వభావమున్న రామోజీ రావు..చివరికి తాను చనిపోయిన తర్వాత తన చివరి మజిలీ కోసం తన స్మారకాన్ని కూడా ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని ఓ ప్రాంతంలో తన స్మృతి కట్టడాన్ని ఆయన బ్రతికి ఉన్నపుడే దగ్గరుండి నిర్మించుకున్నారు. ఇప్పుడు అక్కడే రామోజీ అంత్యక్రియలు జరిగాయి.