టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదర స్వాగతం పలికారు. రాధా హత్యకు చేసిన రెక్కీ వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాధాకు పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు భరోసానిచ్చారు. రాధా భద్రతపై ఆరా తీసిన చంద్రబాబు…అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాధా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
వంగవీటి రాధా హత్యకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన మర్డర్ కోసం రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాధా వ్యాఖ్యలతో 2+2 గన్ మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా…రాధా దానిని తిరస్కరించారు. తనకు ప్రజా బలమే సెక్యూరిటీ అని అన్నారు. ఇక, రాధా రెక్కీ ఆరోపణల నేపథ్యంలో దేవినేని అవినాష్ అనురుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పుకార్లు వినిపించగా…ఆ ఆరోపణలను ఆ అనుచరుడి కుమారుడు ఖండించాడు.
ఆల్రెడీ వంగవీటి రాధాకు ఫోన్ చేసిన చంద్రబాబు…రెక్కీ వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్మన్లు వద్దంటూ రాధా చెప్పడం సరికాదని, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు చంద్రబాబు సలహా ఇచ్చారు. రాధాకు టీడీపీ మద్దతుగా ఉంటుందని, ఎవరైనా కుట్రలకు పాల్పడితే దానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని అన్నారు.