ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై సహా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 7న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అదంతా వదంతులేనని, సినిమా తప్పక విడుదలవుతుందని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కానీ, ఆ ఊహాగానాలను నిజం చేస్తూ సినిమా విడుదల వాయిదాపై ఆర్ఆర్ఆర్ చిత్ర టీం అధికారికంగా ప్రకటన చేసింది. కరోనా విజృంభిస్తున్న కారణంతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ, నిబంధనలు నడుస్తున్నాయని, అందువల్ల సినిమాను జనవరి 7న విడుదల చేయలేకపోతున్నామని తెలిపింది. మంచి టైమ్లో ఈ పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ట్వీట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ చేసిన ట్వీట్ తో తారక్, చెర్రీ అభిమానులు నిరాశ పడ్డారు.
కరోనా పరిస్థితులతోపాటు ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం నేపథ్యంలోనూ ఆర్ఆర్ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత భారీ బడ్జెట్ చిత్రం తీసుకురావడం రిస్క్ అని నిర్మాతలు భావించారట. ఆర్ఆర్ఆర్ వాయిదాతో పవన్ ఫ్యాన్స్, మహేష్ బాబు అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం పవన్, మహేష్ లు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారని, ఇపుడు సంక్రాంతికి పెద్ద సినిమా ఏదీ విడుదలయ్యే చాన్స్ లేదని సినీ అభిమానులు నిట్టూరుస్తున్నారు.