అధికారంలో ఉన్నా.. లేకున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. పార్టీ అన్న తర్వాత పంచాయితీలు మామూలే. కాకుంటే.. అలాంటి వాటిని మొగ్గలో ఉన్నప్పుడే తుంచేస్తే.. తలనొప్పులు సగం తగ్గుతాయి. కానీ.. బాబు తీరు అందుకు భిన్నం. విషయాల్ని సా..గతీత ధోరణితో కొనసాగిస్తుంటారు. నియోజకవర్గాల వారీగా తమ్ముళ్ల మధ్య పంచాయితీల్ని ఒక కొలిక్కి తీసురారు. కాలమే.. సమాధానం చెబుతుందన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. దీంతో.. గ్రూపు తగాదాలు ఎక్కువ అవుతుంటాయి.
ఏపీ వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఇంఛార్జులు లేని పరిస్థితి. ఎక్కడో ఎందుకు చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇన్ ఛార్జిలు లేని నియోజకవర్గాలు ఉండటం గమనార్హం. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న మూడు ఖాళీల్ని ఒకేసారి ఖరారు చేసిన వైనం చూస్తే.. బాబుకు ఇప్పటికి కానీ వేడి తగల్లేదన్న మాట వినిపిస్తోంది.
సత్యవేడుకు డాక్టర్ హెలెన్.. గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్ లను నియమించారు. పూతలపట్టు నియోజకవర్గానికి తిరుపతిలో పని చేసే పాత్రికేయుడు మురళీమోహన్ ను ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న పోటీ కారణంగా ఇన్ ఛార్జిలను నియమించకుండా ఉన్న చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలకు గడువు తొమ్మిది నెలలకు తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఈ అంశాల్లో నిర్ణయానికి తెగువ ప్రదర్శిస్తున్నారు.
సత్తెనపల్లికి సైతం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంచి.. ఈ మధ్యనే బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను ఇన్ చార్జిగా ప్రకటించటం తెలిసిందే. పత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి రామాంజనేయులు రేసులో ఉండగా.. తాజాగా ఆయన అల్లుడు రాజేశ్ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఇన్ చార్జి పోస్టు కోసం తెర మీదకు వచ్చారు. ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరిని ఎంచుకుంటారన్నది ఆస్తికరంగా మారింది.
ఇదే తీరులో పలు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సా..గతీతకు బ్రేకులు వేస్తున్న చంద్రబాబు.. ఇన్ ఛార్జిల ఎంపిక విషయంలో వేగాన్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాల్ని వడివడిగా తీసుకోవాలన్న ఒత్తిడి తమ్ముళ్ల నుంచి ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. ఈ వేడితోనే బాబులో కాస్త మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది.