ఏలూరు సభలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లనుద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లు ఇచ్చిన డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. పవన్ చెప్పినట్లుగా మిస్సయిన మహిళల వివరాలు, ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరింది.
ఈ క్రమంలోనే పవన్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని ఆరోపించారు. సీఎం సీటు కోసం ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తారా అని తప్పుబట్టారు. మహిళల మిస్సింగ్ గురించి పవన్ కు సమాచారమిచ్చిన కేంద్ర అధికారి ఎవరో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు భద్రతకు భంగం కలిగించేలా పవన్ వ్యాఖ్యలున్నాయని, వాటిని ఆయన తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ మహిళా విభాగం తప్పుబట్టింది. రాష్ట్ర డీజీపీని కలిసి పవన్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక, పవన్ పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో కొందరు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అందుకు తమకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాము వాలంటీర్లుగా ఏం సేవలు అందిస్తున్నామో పవన్ చూశారా అని వారు మండిపడ్డారు. పవన్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఏపీలో కొన్నిచోట్ల పవన్ దిష్టిబొమ్మను వాలంటీర్లు దగ్ధం చేశారు.