దసరా సందర్భంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితిపై ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ లాంచ్ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటిక్ పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు.
బీజేపీ పాలనలో మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏమిటని ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని అన్నారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ కు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు కూడా కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆది పురుషుడిగా నిలిచారంటూ వర్మ కితాబిచ్చారు. అంతేకాదు, ఈ తరహా ప్రయోగం చేసిన తొలి నేతగా కేసీఆర్ నిలిచారని వర్మ ప్రశంసించారు. ఇక, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ కు వర్మ స్వాగతం పలికారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కట్టిన తొలి నేతగా కేసీఆర్ ను వర్మ అభివర్ణించినట్లుగా కనిపిస్తోంది. ఇలా చేసిన తొలి పురుషుడు (ఆది పురుష్) కేసీఆర్ అని అర్థం వచ్చేలా వర్మ కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. విజయదశమినాడు ప్రారంభమైన బీఆర్ఎస్ దేశ రాజకీయాలలో విజయదుందుభి మోగించాలని నామా ఆకాంక్షించారు. ఈ పార్టీ దేశ భవిష్యత్తును మార్చబోతోందని, దేశ రాజకీయాల్లో నవశకానికి ఈ పార్టీ నాంది పలికిందని నామా అన్నారు. దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ నూతన అధ్యాయాన్ని లిఖించిందని అన్నారు. తెలంగాణ మోడల్ ను దేశానికి దిక్సూచిగా మార్చబోతున్నామని నామా అన్నారు.