కదిలించుకోవటం ఎందుకు? కొట్టించుకోవటం ఎందుకు? ఉన్న కాస్తపాటి పరువును మట్టిలో కలిసిపోయేలా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. విపక్షంలో ఉన్నప్పటికీ.. ఇంతటి కసి కాంగ్రెస్ లో ఉండటమా? అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా విపక్షాలపై భౌతికంగా విరుచుకుపడే వేళలో.. అధికారపక్షానిదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది. అందుకు భిన్నంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ మీద బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు కోడిగుడ్లు.. టమోటాలతో దాడి చేయటం షురూ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి చెందిన థియేటర్ వద్దకు చేరిన గులాబీ శ్రేణులు.. దాన్ని వేదికగా చేసుకొని రేవంత్ సభపై కోడిగుడ్లు.. టమోటాలతో దాడి చేశారు. దీనికిప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు వెనుకా ముందు చూసుకోకుండా కంకరరాళ్లు.. చెప్పులతో తమ సమాధానాన్ని చెప్పుకొచ్చారు. ఊహించని ఈ ప్రతిఘటనకు గులాబీ దళాలకు దిక్కు తోచలేదు. అప్పటి వరకు గుడ్లు.. టమోటాలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కంకర రాళ్లతో ప్రతిదాడిచేయటం ద్వారా బలమైన సందేశాన్ని పంపించినట్లుగా మారిందంటున్నారు.
ఈ ఉదంతాన్ని చూసినప్పుడు ప్రత్యర్థి బలంపై ఏ మాత్రం అవగాహన లేకుండా.. పాతపద్దతిలో దాడికి పాల్పడటం గులాబీ కార్యకర్తలు చేసిన పెద్ద తప్పుగాచెప్పక తప్పదు. ఇలాంటి వాటికి తమ పార్టీ కార్యకర్తలు ప్లానింగ్ చేస్తే అడ్డుకోవాల్సింది పోయి.. ప్రోత్సహిస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు. రేవంత్ కార్నర్ మీటింగ్ కు ముందు టీపీసీపీ సభ్యుడు మాట్లాడుతున్న వేళలో కొందరు కోడిగుడ్లతో దాడి చేసినా.. కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ మాట్లాడే వేళలో మరోసారి కోడిగుడ్లు.. టమోటాలు విసిరిన వైనంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. దాడికి ప్రతిదాడి అన్న రీతిలో కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ శ్రేణులు ఉరికించిన వైనం గులాబీ పార్టీ శ్రేణులు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. కదిలించుకొని మరీ కొట్టించుకున్నామన్న మాట వారి నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.