అమరావతి రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో దిగ్విజయంగా సాగిస్తోన్న ఈ యాత్ర 13వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద యాత్ర ఆగింది. అయితే, ప్రకాశం జిల్లా నిడమనూరులోని ఓ వార్డులో ఉపఎన్నిక ఉన్నందున 13వరోజు యాత్రకు రైతులు విరామం ప్రకటించారు. రైతుల పాదయాత్ర ఆదివారం ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.
అంతకుముందు, 12వరోజు యాత్ర సందర్భంగా రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. యరజర్ల గ్రామంలో కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూసి ప్రభుత్వం ఓర్చుకోలేక పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహా పాదయాత్ర కొనసాగించి తీరుతామని రైతులు తేల్చి చెప్పారు.
అంతకుముందు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో యాత్ర సందర్భంగా భారీగా పోలసు బలగాల్ని మోహరించారు. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించి చెక్‌పోస్టులు పెట్టారు. ఆ దారిలో వెళ్లేవారందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో వందల మంది పోలీసులు లాఠీలు పట్టుకుని, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు.