ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటి చేసే అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఫిక్స్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారు.
విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేసినట్లు జగన్ స్వయంగా ప్రకటించారు. చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పై అనర్హత వేటుతో ఎమ్మెల్సీ స్థానం ఖళీ అయింది. 2021 నవంబర్ లో వంశీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికై.. అదే ఏడాది శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 2023లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోవడంతో వంశీకృష్ణపై వైకాపా అధిష్టానం అనర్హత వేటు వేసింది. దీంతో ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆగస్టు 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బోత్స పేరును ఖరారు చేసింది.
ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కించి అదే రోజు రిజల్ట్ ను అనౌన్స్ చేస్తారు. కాగా, విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉండగా.. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఒక సవాల్ గా మారింది.