విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి కారణమంటూ కొందరు బీసీ యువకులను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో టిడిపి నేత బొండా ఉమను కూడా ఇరికించేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సతీష్ అనే బీసీ యువకుడిని బెదిరించి బోండా ఉమా పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా దృష్టికి తీసుకు వెళ్ళామని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పారు.
మెసేజ్ ద్వారా ఆయనకు ఫిర్యాదు చేశామని, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరమని అన్నారు. బోండా ఉమ గెలుపు ఖాయమని, అందుకే ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలా బురదజల్లు న్నారని ఆరోపించారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో తన చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బోండా ఉమా అన్నారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారని, ఆశించిన సానుభూతి రాకపోవడంతో ఈ వ్యవహారాన్ని టిడిపి నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉమా ఆరోపించారు.
వేముల దుర్గారావు తన పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటాడని, అతడిని అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై దాడితో తనకు సంబంధం లేదని, కానీ కొందరు అధికారులు తనని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమా ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తనకు డబ్బులు ఇవ్వనందుకే ఈ దాడి చేశామని నిందితుల్లో ఒకరు చెప్పారని ఉమ గుర్తు చేశారు.