హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టారు. మొత్తానికి పట్టయితే.. పెంచుకున్నారు. అయితే.. అధికార పార్టీ మాత్రం అంతర్మథనంలో పడింది. ఎందుకంటే.. జీహెచ్ ఎంసీని కైవసం చేసుకున్నా.. కార్పొ రేట్ల సంఖ్య తక్కువగా ఉండడం.. మరోవైపు బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయడం తో.. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఒకవిధంగా ఆత్మరక్షణలో పడింది. అయితే.. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఓ విషయాన్ని తెరమీదికి తెచ్చారు. హైదరాబాద్‌లో సుమారు 9 వేల ఎకరాల్లో ఉన్న కంటోన్మెంట్ ఏరియా విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇటీవల ఓ ట్వీట్లో కేటీఆర్.. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారిని త్వరలోనే జీహెచ్ ఎంసీలో విలీనం చేస్తామని కూడా చెప్పారు. ఇదే ఇప్పుడు రాజకీయ వ్యూహాత్మక అడుగుగా.. విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి కంటోన్మెంట్ ఏరియా సమస్య ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కంటోన్మెంట్ సమస్యలు ఉన్నాయి. ఈ ఏరియా రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉంది. ఆర్మీ, నేవీ సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అయితే.. ఇందులోనే మరో 2 వేల ఎకరాల పైచిలుకు ప్రాంతంలో.. బస్తీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అంతేకాదు.. వాళ్లు పరాయిరాష్ట్రంలో ఉన్నామనే ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తమను జీహెచ్ ఎంసీలో విలీనం చేయాలని.. కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ సమస్య ఇప్పుడే తెరమీదికి వచ్చినట్టు.. కేటీఆర్ ఫీలవుతున్నారనే అనే విమర్శలు వస్తున్నాయి. పోనీ.. తెలంగాణ వచ్చినప్పుడైనా.. కేటీ ఆర్ స్పందించ వచ్చు కదా? అంటే.. దీనికి టీఆర్ ఎస్ నేతల దగ్గర సమాధానం లేదు. సరే.. ఇదిలావుంటే.. ఇప్పుడే కేటీఆర్ ఎందుకు స్పందించారు? అనే దానికి ప్రధాన కారణాలురెండు కనిపిస్తున్నాయి.
ఒకటి: దేశవ్యాప్తంగా.. 62 కంటోన్మెంట్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో బస్తీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా బస్తీలను విడదీసి.. ఆయా రాష్ట్రాల పరిధిలో చేర్చే ప్రతిపాదనను కేంద్రం కేంద్రం పరిశీలించింది. దీనికి సంబంధించి అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధ్యయన నివేదిక కేంద్రానికి చేరిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకుని, కంటోన్మెంట్ జోన్లపై నిర్ణయం తీసుకుంది. సో.. నివేదిక రాకముందే.. ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు కేటీఆర్ ఇచ్చేయడం ద్వారా ఆయా బస్తీల ప్రజలను ఆకర్షించారు.
రెండు: కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ ఎంసీలో విలీనం చేయడమనే విషయం వెనుక క్రెడిట్‌ను బీజేపీకి ఇవ్వకపోవడం. అంటే.. వాస్తవానికి కంటోన్మెంట్ ఏరియాను మార్పుచేస్తున్నది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. సో.. ఇప్పుడు ఇక్కడి నాయకులు .. దీనిని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. వీరికి ఆ ఛాన్స్ ఇవ్వకుండానే కేటీఆర్.. వ్యూహాత్మకంగా ముందే కూసిన కోయిల మాదిరిగా.. కంటోన్మెంట్ ఏరియా ప్రజలకు తాము మేళ్లు చేస్తున్నామని హామీ ఇస్తున్నారు. మొత్తానికి ఇదంతా బీజేపీపై పైచేయి సాధించేనని పరిశీలకులు చెబుతున్నారు. మరి బీజేపీ తనకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటుందా? చూడాలి!!