విక్రమ్, కల్కి 2898 ఏడీ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ భారతీయుడు 2. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్ భారతీయుడు సినిమాకి సీక్వెల్ ఇది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై రూ. 250 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, బాబీ సింహా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. జూలై 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన భారతీయుడు 2 మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో థియేటర్స్ కు వెళ్తున్న ప్రేక్షకులు నిరాశతో బయటకు వస్తున్నారు. మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి చాలా మైనస్ పాయింట్లు వినిపించాయి.
అలాగే భారతీయుడు 2 చిత్రానికి కలెక్షన్స్ కూడా అనుకున్న స్థాయిలో రావడం లేదు. తెలుగులో తొలి రోజు రూ. 6.75 కోట్ల రేంజ్లో వసూళ్లను అందుకున్న ఈ సినిమా.. రెండో రోజు రూ. 2.88 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్ల దాకా ఉండగా.. రెండు రోజుల్లో మొత్తం రూ. 9.63 కోట్ల షేర్, రూ. 15.70 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇంకా రూ. 15.37 కోట్ల రేంజ్ లో షేర్ వస్తే తెలుగులో భారతీయుడు 2 సేఫ్ అవుతుంది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. మొదటి రోజు రూ. 28.50 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న భారతీయుడు 2 మూవీ రెండో రోజు రూ. 14 కోట్లు రాబట్టింది. రెండు రోజుల మొత్తం లెక్క రూ. 42.50 కోట్ల షేర్ మరియు రూ. 87.30 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా భారతీయుడు 2 సినిమా వాల్యూ టార్గెట్ రూ. 172 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే ఇంకా రూ. 129.50 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది.