యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల `భారతీయుడు 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి ఇది సీక్వెల్ కాగా.. శంకర్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్, ఎస్జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై నిర్మితమైన భారతీయుడు 2 మూవీ అనేక అడ్డంకులను దాటుకుని జూలై 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. తొలి రోజే నెగటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లపై చాలా గట్టి ప్రభావం పడింది.
చాలా థియేటర్స్ లో భారతీయుడు 2 మూవీని తొలగించారు. ఇదే తరుణంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. నెల తిరక్కుండానే భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
థ్రియట్రికల్ రిలీజ్ అయిన రెండు నెలల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేలా మొదట అగ్రీమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంలో కాస్త ముందుగానే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆగస్టు 2న భారతీయుడు 2 మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.