సుదీర్ఘకాలంగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు భారీ ఎత్తున ఆస్తులు ఉంటాయని అందరూ అను కుంటారు. ఇది తప్పుకాదు. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా.. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తిరుగులేని హీరోగా ఉన్న బాలయ్య కోట్లకు కోట్ల రూపాయల ఆస్తులు పోగేసి ఉండడం తప్పు కూడా కాదు. అయితే.. తాజాగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఏమేరకు తనకు ఆస్తులు ఉన్నాయో.. బాలయ్య వివరించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బాలయ్య.. తాజాగా సతీమణి వసుంధరతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
హిందూపురం నుంచి మూడోసారి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ పత్రాలతో పాటు ఆయన సమర్పించిన ఆస్తులు, అప్పుల అఫిడవిట్లో పలు విషయాలు వెల్లడించారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు ఉందని పేర్కొన్నారు. అయితే. ఆమె ఏ వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక, ఏకైక కుమారుడు మోక్షజ్ఞ పేరిట ఉన్న ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు.
ఇక, అప్పుల విషయానికి వస్తే.. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని బాలయ్య వెల్లడిం చారు. తమ కుటుంబానికి 4 కార్లు ఉన్నాయని తెలిపారు. స్థిర చరాస్తుల విలువను ఆస్తి విలువలో జోడించినట్టు పేర్కొన్నారు. కేసుల విషయానికి వస్తే.. తనపై కేసులు ఏమీ లేవని తెలిపారు. ఇదిలావుంటే.. టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన వారి సంఖ్య 42 కు చేరింది. మిగిలిన వారు సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉంది.