ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చారిత్రాత్మక పరాజయాన్ని మూట కట్టుకోవడంతో.. ఆ పార్టీలోని నాయకులంతా పక్క చూపులు చూస్తున్నారు. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీకి మరియు అధినేత జగన్ కు బై బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ నాయకుడు మరెవరో కాదు అవంతి శ్రీనివాస్.
జగన్ క్యాబినెట్ లో రెండున్నర ఏళ్లు మంత్రిగా పని చేయడమే కాకుండా ఫ్యాన్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన అవంతి శ్రీనివాస్.. గురువారం తన రాజీనామాను ప్రకటించారు. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు నచ్చకపోవడం.. పైగా రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్ కనిపించకపోవడం దృష్ట్యా ఆయన వైసీపీని వీడారని తెలుస్తోంది.
కాగా, అవంతి శ్రీనివాస్ అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాస రావు. ఆయన రాజకీయవేత్త మాత్రమే కాదు విద్యావేత్త కూడా. కాపు సామాజిక వర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్.. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. భీమిలి నుంచి పోటీచేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ను వీడి.. 2014 ఎన్నికలకు టీడీపీలో జాయిన్ అయ్యారు.
ఆ పార్టీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన అవంతి.. భీమిలి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యరు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీకి గుడ్ బై చెప్పేసిన అవంతి.. తర్వలో టీడీపీ లేదా జనసేనలో చేరనున్నాని ప్రచారం జరుగుతోంది.