2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా జగన్ కు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడు,బంధువ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే జగన్ కు వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ షాక్ ఇచ్చారు.
జగన్ కు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ భారీ షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని వైఎస్ జగన్ కు అవంతి రాజీనామా లేఖ రాశారు.
తన రాజీనామాను ఆమోదించవలసిందిగా అవంతి శ్రీనివాస్ కోరారు. ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ వైసీపీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో, ఆయన పార్టీని వీడతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి.
అయితే, తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని అవంతి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరేదైనా పార్టీలో చేరతారా లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.
ఇక, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. తన పదవులకు కూడా రాజీనామా చేసిన గ్రంధి..రాజీనామాను ఆమోదించాలని కోరారు. గ్రంధి త్వరలోనే టీడీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఓటమి భారంతో సతమతమవుతున్న జగన్ కు కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకే రోజు జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.