గులాబీ బాస్ కేసీఆర్ కు.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన చేతిలో అధికారం ఉన్న పదేళ్లలో ఈ ఇద్దరు అధినేతల మధ్య సంబంధాలు బలంగా ఉండటంతో పాటు.. సందర్భం ఏదైనా కేసీఆర్ కు తన పూర్తి సహకారాన్ని అందించారు అసద్. అదే సమయంలో మిత్రుడికి అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు కేసీఆర్.
ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందో.. అప్పటి నుంచి గులాబీ పార్టీకి.. మజ్లిస్ కు మధ్య దగ్గరతనం తగ్గి.. దూరం పెరిగింది. తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాటల్ని చూస్తే.. గులాబీ బాస్ తో మాటా మంతి కూడా బంద్ అయ్యిందా? అన్న సందేహం కలుగకమానదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మజ్లిస్ తీరుపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నట్లు చెబుతారు.
పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సపోర్టు చేయటాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు చెబుతారు. మజ్లిస్ విషయానికి వస్తే అధికారంలో ఎవరుంటే వారికి సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అలవాటే. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రమే దీనికి మినహాయింపుగా చెప్పాలి. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా పెద్ద ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందా? లేదంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా? అన్న విషయం తనకు తెలీదని.. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్ని తాను సైతం చదివినట్లుగా పేర్కొన్నారు. ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని డెవలప్ చేసిందని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలీవన్న అసద్.. ఆ మాత్రం తెలీకుంటే గులాబీ బాస్ కు ఒక ఫోన్ కొట్టేయొచ్చు కదా? ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అందునా మజ్లిస్ అధినేత ఫోన్ కాల్ ను గులాబీ బాస్ అటెండ్ చేయకుండా ఉంటారంటారా?