2016లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి అరకు లో ఆర్గానిక్ కాఫీ తాగానని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆనాడు చంద్రబాబుతో కలిసి తాను కాఫీ తాగుతున్న ఫోటోలను మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ ట్వీట్ పై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మరోసారి మోడీతో కలిసి అరకు కాఫీ తాగాలని ఉందని ట్వీట్ చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్ తానే కనిపెట్టినట్లుగా ప్రధాని మోడీ డబ్బా కొట్టుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు వేశారు. ఈ నేపద్యంలోనే ఆ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. జాతీయ పార్టీకి నాయకుడైన జైరాం రమేష్ నుంచి మర్యాద, నిజాయితీని ఆశిస్తున్నామని లోకేష్ అన్నారు. అరకు కాఫీ గొప్పదనం గురించి ప్రధాని మోడీ చెప్పారని, దశాబ్దాలుగా గిరిజనుల సహకారంతో నడుస్తున్న గిరిజన సహకార సంఘం గురించి, అది క్రియాశీలకంగా ఉన్న విధానం గురించి మాత్రమే వివరించారని చెప్పారు.
ప్రధాని చేసిన వ్యాఖ్యలు, ఫోటోలపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నాటుగా, మీరు అనుకుంటున్నట్లుగా మోదీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని లోకేష్ అన్నారు. మరి, లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జైరాం రమేష్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.