ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హోం మంత్రి అనిత వంగలపూడి సూటి ప్రశ్న వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 35 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారంటూ జగన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో శాంతిభద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జగన్ ఢిల్లీలో బుధవారం నిరసనకు కూడా దిగారు.
అయితే జగన్ చేపట్టిన ధర్నాపై హోం మంత్రి అనిత సెటైర్లు వేశారు. జగన్ చేస్తుంది ధర్నా కాదు కేవలం డ్రామా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్కు ఎన్డీయే నాయకులెవ్వరూ మద్దతివ్వలేదని.. ఆయన పాలనలో జరిగిన విధ్వంసాన్ని తెలియని వారే మద్దతు ఇచ్చారని అనిత అన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. 36 మంది రాజకీయ హత్యలు జరిగితే.. కేవలం ఒక్కరిని మాత్రమే జగన్ ఎందుకు పరామర్శించారని సూటిగా అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కక్షల వల్ల నలుగురు మాత్రమే చనిపోయారని.. వారిలో ముగ్గురు టీడీపీకి చెందిన వారే అని అనిత మరోసారి గుర్తుచేశారు.
బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ఢిల్లీ వెళ్లి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి.. జగన్ అక్కడ ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారని అనిత దుయ్యబట్టారు. వైకాపా హయాంలో జరిగిన దారుణ ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం సరిపోదని ఆమె సెటైర్లు వేశారు.