ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్ల విధులపై చాలా కాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధులకు ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక వంటి విషయాలలో ప్రభుత్వానికి, వైసీపీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను నియమించారా అంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని యాప్ లో నిక్షేపం చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం కాదా అంటూ సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ను హైకోర్టు ధర్మాసనం నిలదీసింది.
తమను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని, దానికి పార్టీపరమైన విభేదాలు కారణమని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సెర్ప్ సీఈవో ఇంతియాజ్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. లబ్దిదారుల ఎంపికను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో లబ్ధిదారులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారని , అసలు వాలంటీర్ల జవాబుదారీతనం ఏమిటని హైకోర్టు నిలదీసింది.
లబ్ధిదారుల అర్హతలు నిర్ణయించడం సేవ ఎలా అవుతుందని హైకోర్టు నిలదీసింది. పంచాయతీ కార్యదర్శి, ఆర్ఐ, విఆర్వోలు చేయవలసిన పనిని వాలంటీర్లకు అప్పగించడం సామాజిక సేవ అనిపించుకోదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, సంక్షేమ పథకాల అమలుకు, లబ్ధిదారుల ఎంపికకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. కానీ, పథకాల అమలుకు ఎంచుకున్న విధానమే చట్ట విరుద్ధంగా కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయ పడింది.
వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, వాలంటీర్ల సర్వీసును చట్టబద్ధంగా రెగ్యులర్ చేయాలని సూచించింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి సర్వీస్ రూల్స్ వారికి వర్తింపజేయాలని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.