రైతన్నలకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. నాటి వైసీపీ పాలనలో రైతుల నెత్తిపై జగన్ పెట్టిన గుదిబండను నేటి కూటమి ప్రభుత్వం దించేసింది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పనులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోడీ మెడ మీద కత్తి పెట్టినా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటునకు అంగీకరించలేదు. రైతుల శ్రేయస్సే ముఖ్యమన్నారు.
కానీ జగన్ మాత్రం రైతులు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టినా అవేమి పట్టించుకోకుండా 18.58 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 శాతం అదనపు రుణం కోసమే మీటర్ల ఏర్పాటు చెస్తున్నట్లు చెప్పుకున్నా.. తన బినామీ కంపెనీగా పేరున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు లబ్ధీ చేకూర్చడమే జగన్ నిర్ణయం వెనకున్న లక్ష్యమని ఆరోపణలు వచ్చాయి. ఆల్రెడీ రాష్ట్రంలో 50 వేల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా కూటమి ప్రభుత్వం రైతన్నలపై జగన్ మోపిన భారాన్ని దించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బెడద లేకుండా చేసింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చేసే సుమారు రూ. 6,500 కోట్లను వృథా ఖర్చుగా తేల్చేసింది. నిర్వహణ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి వేసిన ప్లాన్ ను కూటమి ప్రభుత్వం నీరుగార్చడంతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు బిగ్ షాక్ తగిలినట్లైంది.